భగవంతుడు అనుగ్రహించడానికి ఆలస్యం చేయడు!
భగవంతుడు మంచువంటి మనసున్నవాడు .. ప్రేమతో పిలిస్తే కరిగిపోతాడు. భగవంతుడు కరుణా సముద్రుడు .. అంకితభావంతో చేసే సేవతో పొంగిపోతాడు. వైకుంఠంలో హాయిగా సేదదీరుతూ కనిపించే స్వామి .. తన భక్తులను కాపాడటానికి అవన్నీ వదిలేసి వెళ్లడానికి ఎంతమాత్రం ఆలస్యం చేయడు.
ఒకసారి నారద మహర్షి శ్రీమన్నారాయణుడి సన్నిధికి వెళ్లాడు. స్వామివారితో నారద మహర్షి మాట్లాడుతూ ఉండగా .. స్వామి ఒక్కసారిగా దిగ్గున లేచారట. విషయమేమిటని నారద మహర్షి అడిగేలోగా అదృశ్యమైపోయాడు. ఆ తరువాత కొంత సేపటికి తిరిగి వచ్చిన స్వామి .. ఆది శ్వేషుడిపై ఆసీనుడయ్యాడు. అంత ఆదుర్దాగా వెళ్లి వచ్చింది ఎక్కడికి స్వామి? అంటూ నారద మహర్షి అడిగాడు. భూలోకంలో ఓ భక్తుడు వేసవి తాపానికి తట్టుకోలేక కుప్పకూలిపోతూ .. ''నారాయణా .." అంటూ తనని తలచుకున్నాడనీ, ఆ భక్తుడి దాహం తీర్చడానికి వెళ్లానని స్వామి వారు చెప్పారట. తన భక్తులు పిలిస్తే స్వామి ఎంత తొందరగా స్పందిస్తాడు అనడానికి ఈ కథ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.