హనుమంతుడికి పుష్ప పూజ ఎంతో ఇష్టమట!
హనుమంతుడు లంకా దహనం చేసి రావడం వలన, ఆయన శరీరానికి అక్కడక్కడా కాలిన గాయాలయ్యాయట. అప్పుడు శ్రీరాముడు ఆయనను తన పక్కనే కూర్చుండబెట్టుకుని, చల్లగా వుండి ఉపశమనాన్ని కలిగిస్తాయనే ఉద్దేశంతో ఆ గాయాలపై తమలపాకులను ఉంచాడట. అందువల్లనే తమలపాకులతో పూజను హనుమంతుడు ఇష్టపడతాడని అంటూ వుంటారు.
తమలపాకుల వల్లనే కాదు .. రకరకాల పూలతో చేసే పూజను కూడా హనుమంతుడు ఎంతో ప్రీతితో స్వీకరిస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శ్రీరాముడు .. సూర్యవంశానికి చెందినవాడు. అలాంటి సూర్యుడి వల్లనే అనేక రకాల జాతుల మొక్కలు ఎదుగుతాయి. ఆ సూర్యభగవానుడే తనకి గురువు. ఆ గురువు నుంచి వచ్చే కిరణాల వల్లనే పూలు వికసిస్తూ ఉంటాయి. అలాంటి పూలతో పూజలందుకోవడం తన అదృష్టంగా హనుమంతుడు భావిస్తాడట .. ఆనందంతో అనుగ్రహిస్తాడట. అందువల్లనే హనుమంతుడిని వివిధ రకాల తాజా పూలతో పూజించడం మరిచిపోకూడదు.