ఇప్పటికీ రాధాకృష్ణులు అక్కడ విహరిస్తారట!
'బృందావనం' .. రాధాకృష్ణుల ప్రేమకు ప్రత్యక్ష సాక్ష్యం. రాధాకృష్ణుల ఆటపాటలతో .. వారి పాద స్పర్శతో పునీతమైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో అడుగుపెట్టడమే అదృష్టం. రాధాకృష్ణులు స్వయంగా తిరుగాడిన ఆ ప్రదేశంలో తిరగడం ఎవరికైనా అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. అలాంటి బృందావనంలో ప్రతి ప్రదేశం పవిత్రమైనదే .. దర్శన మాత్రం చేతనే ధన్యులను చేసేదే.
అలాంటి వాటిలో ఒకటిగా 'సేవాకుంజ్' కనిపిస్తుంది. శ్రీ కృష్ణుడు రాధ తలలో ఇక్కడే పూలు పెట్టేవాడట. ఆమె పాదాలను నొక్కడం .. పారాణి పెట్టడం వంటివి చేసేవాడట. విశేషమేమిటంటే ఇప్పటికీ రాత్రి సమయాల్లో రాధా కృష్ణులు ఈ ప్రదేశంలో విహరిస్తారని ఇక్కడి వాళ్లు విశ్వసిస్తుంటారు. అందువలన పొద్దుపోతుండగానే అందరినీ ఆ ప్రదేశం నుంచి పంపించి వేస్తారట. అర్చక స్వాములు కూడా ఆ సమయంలో అక్కడ ఉండరని అంటారు. మరి కాసేపట్లో రాధా కృష్ణులు ఇక్కడికి వస్తారు గదా .. ఇక్కడ ఆడిపాడతారు గదా .. ఆహా ఆ దృశ్యం ఎంత రమణీయం అనుకుంటూ భక్తులు అక్కడి నుంచి వెనుదిరుగుతారు.