నంది కొమ్ముల నుంచి వెలుగులు వచ్చేవట!
పరమశివుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో 'నంది వెలుగు' ఒకటి. తెనాలి సమీపంలో ఈ మహిమాన్విత క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడి శ్వేతలింగం భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. అగస్త్యేశ్వరుడు ప్రతిష్ఠించి ఆరాధించడం వలన, ఇక్కడి స్వామివారిని అగస్త్యేశ్వరుడు అనే పేరుతోనే కొలుస్తుంటారు. కాలాంతరంలో చాళుక్య విష్ణువర్ధనుడు ఈ ప్రాంతం మీదుగా వెళుతూ, పూజలకు దూరమైన శివుడిని చూశాడట.
కాంతి పుంజాలతో స్వామివారికి నిత్యార్చన జరగాలనే ఉద్దేశంతో, కొంతమంది శిల్పులను రప్పించాడట. గణపతి ప్రతిమను తయారు చేయించి, స్వామి గర్భంలో రత్నాలను పొదిగించాడు. ఆ ప్రతిమకి ఎదురుగా నంది విగ్రహాన్ని వుంచి ఆ నంది కొమ్ములలోను రత్నాలను పొదిగించాడు. సూర్యుడి కిరణాలు గణపతి విగ్రహం గర్భంలోని రత్నాలపై పడి .. ఆ వెలుగులు నంది కొమ్ములలోని రత్నాలపై పడి పరావర్తనం చెంది, శివలింగంపై ఆ వెలుగులు పడేలా చేశాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి 'నంది వెలుగు' అనే పేరు వచ్చిందని అంటారు.