అమ్మను మించిన దైవం లేదు
ఆకాశానికే కాదు .. అమ్మ ప్రేమకూ హద్దు లేదు. అమ్మా అనే పిలుపులోనే అనంతమైన అనురాగం వుంది. అమ్మా అని పలకడంలోనే మరిచిపోలేనంత మాధుర్యం వుంది. అమ్మ అంటేనే ఆనందం .. అమ్మ ఉంటేనే ఐశ్వర్యం. జీవితాన్నిచ్చి లోకాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చే తొలి గురువు అమ్మే. కష్టాలు ఎదురైనప్పుడు .. కన్నీళ్లు ముంచేస్తున్నప్పుడు అమ్మ ఒక్కసారి దగ్గరికి తీసుకుంటే చాలు .. అవన్నీ దూరంగా పారిపోతాయి.
ఆవేదనకు అమ్మ ఓదార్పుకు మించిన విరుగుడు లేదు. తన బిడ్డల సంతోషం కోసం కష్టాల్లో కర్పూరంలా కరిగిపోవడానికి కూడా అమ్మ ఇష్టంగా సిద్ధపడుతుంది. అందుకే కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మయేననేది మహానుభావుల మాట. అలాంటి తల్లిని ప్రేమగా చూసుకోవడం వలన .. ఆత్మీయంగా సేవించడం వలన .. భక్తితో నమస్కరించడం వలన, అనేక క్షేత్రాలను దర్శించిన ఫలితం దక్కుతుందనీ .. అనేక పుణ్య తీర్థాల్లో స్నానమాచరించిన పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.