నరసింహస్వామిని శాంతింపజేసిన హనుమ!
నరసింహస్వామి ఆవిర్భవించిన క్షేత్రాలను పరిశీలిస్తే .. ఆయన ఉగ్రరూపంలో కనిపించే క్షేత్రాలే ఎక్కువగా ఉంటాయి. యోగ ముద్రలో కొలువైన క్షేత్రాలు తక్కువగానే ఉంటాయి. అలా స్వామి యోగ ముద్రలో ఆవిర్భవించిన క్షేత్రంగా 'తిరుక్కడిగై' కనిపిస్తుంది. తమిళనాడులోని 'తిరుత్తణి'కి సమీపంలో గల ఈ క్షేత్రం, 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటిగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
ఈ క్షేత్రంలో స్వామివారికి ఎదురుగా గల 'చిన్నమలై' కొండపైన హనుమంతుడు దర్శనమిస్తూ ఉంటాడు. హనుమంతుడు కూడా ధ్యానముద్రలోనే ఉండటం విశేషం. హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం నరసింహస్వామి ఉగ్రరూపంతో ఊగిపోతుండగా, శాంతించమని హనుమంతుడు ప్రార్ధించగా స్వామి చల్లబడ్డాడట. అలా స్వామితో పాటు హనుమ కూడా ఇక్కడే కొలువుదీరాడని స్థల పురాణం చెబుతోంది. ఈ క్షేత్రంలో అడుగుపెట్టడం వలన .. ఇక్కడి బ్రహ్మ పుష్కరిణిలో స్నానం చేయడం వలన .. నరసింహ స్వామిని .. హనుమను దర్శించుకోవడం వలన, అనారోగ్యాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయనేది మహర్షుల మాట.