అందుకే ధర్మస్థలకి ఆ పేరు!
'ధర్మస్థల' పేరు వినగానే మంజునాథ స్వామి గుర్తుకు వస్తాడు. ఆయన చూపిన లీలా విశేషాలు కనులముందు కదలాడతాయి. అలాంటి ధర్మస్థలకి ఆ పేరు రావడానికి వెనుక ఆసక్తికరమైన ఒక కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఈ ప్రదేశంలో అన్యోన్య దంపతులు ఉంటూ ఉండేవారు. ఎలాంటి పరిస్థితుల్లోను వాళ్లు ధర్మం తప్పకుండా జీవితాన్ని కొనసాగిస్తూ వుంటారు.
వాళ్ల త్యాగ నిరతిని పరీక్షించడానికి ధర్మదేవతలు మారు వేషాల్లో వస్తారు. ఆ దంపతులు తలదాచుకుంటోన్న ఇంటిని తమకి ఇవ్వవలసిందిగా కోరతారు. మారు మాటాడకుండా ఆ దంపతులు సంతోషంతో తమ ఇంటిని వాళ్లకి అప్పగిస్తారు. వాళ్ల త్యాగనిరతికి సంతోషించిన ధర్మదేవతలు, ఆ దంపతులకి ప్రత్యక్ష దర్శనమిచ్చి .. అక్కడే కొలువుదీరతారు. ధర్మదేవతలు కొలువైన ప్రదేశం కనుక, 'ధర్మస్థలి' అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ధర్మదేవతల సన్నిధిలోనే మంజునాథుడి ప్రతిష్ఠ జరిగింది. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిందేననేది పెద్దల మాట.