పుణ్యఫలాలను ప్రసాదించే శివారాధన
పరమశివుడి లీలా విశేషాలను తలచుకుంటే చాలు జన్మ ధన్యమవుతుంది. ఆర్తితో పిలిస్తే చాలు అమ్మ మనసుతో ఆయన అనుగ్రహించడం అనేక మంది భక్తుల విషయంలో చూస్తాం. శివ అనే నామ స్మరణ .. ఆ స్వామి దర్శనం .. ఆ స్వామికి చేసే అభిషేకం ఇవన్నీ కూడా అనంతమైన పుణ్య ఫలాలను అందిస్తాయి. అందువల్లనే ఆ స్వామి ఆలయాలన్నీ భక్తుల సందడితో కనిపిస్తుంటాయి.
కొన్ని శివాలయాల్లో గర్భాలయం బయటే నుంచుని స్వామివారిని దర్శించుకోవడం ఉంటుంది. మరి కొన్ని శివాలయాల్లో భక్తులు శివలింగానికి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది. భక్తులు శివలింగానికి శిరస్సును తాకించి కూడా నమస్కరించుకునే వీలుంటుంది. అయితే శివలింగానికి అభిషేకం చేసేప్పుడు గానీ, శిరస్సును తాకించి నమస్కరించుకునేప్పుడు గానీ శివలింగం పానపట్టానికి కాళ్లు తగలకుండా చూసుకోవాలి. నియమనిష్టలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో చేసే శివపూజ విశేషమైన ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.