అహంభావం అనర్థాలకి దారితీస్తుంది!
అహంభావం అన్నివేళలా విడువదగినదే. అహంభావం వలన మంచి జరిగిన దాఖలాలు లేవు. అది అనర్థాలకు దారితీస్తుంది .. ప్రాణ హానిని కూడా కలిగిస్తుందని చెప్పడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఒకసారి పరీక్షిత్తు మహారాజు వేటకి వెళతాడు. బాగా అలసిపోయిన ఆయనకి దాహం వేస్తుంది. దాంతో నీటి కోసం అన్వేషిస్తోన్న ఆయనకీ శమీక మహాముని ఆశ్రమం కనిపిస్తుంది. సమాధి స్థితిలో వున్న శమీకుడి దగ్గరికి వెళ్లి తన దాహాన్ని తీర్చవలసిందిగా కోరతాడు.
సమాధి స్థితిలో వున్న ఆయనకి ఆ మాటలు వినిపించవు. కానీ వినిపించి కూడా ఆయన సమాధానం చెప్పడం లేదని భావించి, చనిపోయిన ఒక పామును కర్రతో తీసి .. ఆ మహాముని మెడలో వేస్తాడు. అయినా శమీకుడిలో కదలికలేకపోవడం చూసి, పశ్చాత్తాప పడతాడు. కానీ అహంభావంతో ఆయన చేసిన ఆ పని, శమీకుడి కొడుకైన శృంగికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. తన తండ్రిని అవమానించినందుకు గాను, ఆ రోజు నుంచి సరిగ్గా ఏడవ రోజున పాము కాటు వలన మరణిస్తావంటూ పరీక్షిత్తును శృంగి శపిస్తాడు.