అలా అమ్మవారు కనకవర్షం కురిపించిందట!
కర్ణాటక రాష్ట్రం హోస్పేట సమీపంలో.. తుంగభద్ర నదీ తీరంలో హంపీ నగరం కనిపిస్తుంది. అనేక ఆలయాల సమాహారంగా హంపీ దర్శనమిస్తుంది. అలనాటి శిల్పకళా నైపుణ్యానికి ఇక్కడి నిర్మాణాలు అద్దం పడుతుంటాయి. ఈ ప్రాంతం రామాయణ ఘట్టాలను కనులముందు సాక్షాత్కరింపజేస్తుంది. శ్రీరాముడు నడయాడిన ఈ పుణ్య ప్రదేశాన్ని స్పర్శించడం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.
ఇక్కడే పవిత్రమైన 'పంపా సరోవరం' కనిపిస్తుంది. రామ భక్తురాలైన శబరి ఇక్కడే నివసించిందనీ .. శ్రీరాముడికి ఆమె ఆతిథ్యం ఇచ్చింది ఇక్కడేనని స్థలపురాణం చెబుతోంది. ఈ సరోవరం తీరంలోనే విద్యారణ్య స్వామివారు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారట. తపస్సు పూర్తయిన తరువాత ఆయన 'కనకధారాస్తవం' పఠించడంతో, అమ్మవారు అనుగ్రహించి కనకవర్షం కురిపించిందట. ఆ సంపదతోనే ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించాడని అంటారు. ఈ కారణంగానే ఆయన ఈ ప్రదేశంలో విజయలక్ష్మి అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది.