నేరేడుపళ్ల రసంతో శివుడికి అభిషేకం!
పరమ శివుడు పరమ దయా స్వరూపుడు .. భక్తితో కొలిచినంత మాత్రాన్నే కరిగిపోయే కరుణామూర్తి. ఆ స్వామికి అభిషేకం అంటే ఎంతో ప్రీతి. అందువల్లనే ఆయా శైవ క్షేత్రాలను దర్శించే భక్తులు ఆ స్వామికి అభిషేకం చేయిస్తుంటారు. పాలు .. పెరుగు .. తేనెతో పాటు వివిధ రకాల పండ్ల రసాలతోను శివుడికి అభిషేకం జరుపుతుంటారు. ఒక్కో రకం పండ్ల రసంతో స్వామికి అభిషేకం చేయడం వలన, ఒక్కో విశేషమైన ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
అలా నేరేడుపండ్ల రసంతో అభిషేకం చేయడం వలన, విజయం చేకూరుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు అంటున్నాయి. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, ఆ దిశగా ముందుకు వెళుతుంటారు. ఈ ప్రయాణంలో విజయం తప్పనిసరిగా సొంతం చేసుకోవలసి వుంటుంది. విజయం ఆనందాన్నిస్తుంది .. అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తుంది. అందువలన ప్రతి ఒక్కరూ తాము తలపెట్టిన కార్యంలో విజయాన్ని సాధించడానికి కృషి చేస్తుంటారు. అలాంటి వాళ్లంతా 'నేరేడుపండ్ల రసం' తో శివుడికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది.