లక్ష్మీదేవి అనుగ్రహం ఇలా పొందవచ్చు!
జీవితంలో అవసరాలు తీరాలన్నా .. ఆపదల నుంచి గట్టెక్కాలన్నా .. ఆనందంగా ఉండాలన్నా ధనం ఉండాల్సిందే. సంపదే అన్ని అవసరాలు తీర్చకపోయినా .. చాలావరకూ సమకూర్చేది అదే. అందువలన సంపదను పెంచుకోవడంలోను .. జాగ్రత్త చేసుకోవడంలోను అంతా శ్రద్ధ చూపుతుంటారు. అలాంటి సంపదకు కొరత లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి ప్రీతి చెందే పనులు చేయవలసి ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టబడిన ఇళ్లంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ముగ్గు పెట్టబడిన వాకిట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఆగుతుందట. ఆ ఇల్లు శుభ్రంగా వుండి .. పూజా మందిరంలో దీపం పెట్టేసి ఉంటే, ఆ తల్లికి ఆనందం కలుగుతుంది. గుమ్మంలో నుంచి చూస్తే పెరట్లో అరటి చెట్టు .. తులసి మొక్క కనిపిస్తే, ఆ తల్లి ఇక మరో ఆలోచన చేయకుండా ఆ ఇంట్లోకి అడుగుపెడుతుందట. ఆ కుటుంబ సభ్యులంతా సఖ్యతతో .. ప్రశాంతమైన .. ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే, ఆ తల్లి అక్కడే స్థిరనివాసం చేస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.