ఛత్రవట నరసింహస్వామి ప్రత్యేకత
నరసింహస్వామి ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాలలో 'అహోబిలం' ఒకటి. నవ నారసింహ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. స్వామి వారు ఇక్కడ జ్వాలా నరసింహుడు .. మాలోల నరసింహుడు .. వరాహ నరసింహుడు .. కారంజ నరసింహుడు .. భార్గవ నరసింహుడు .. యోగానంద నరసింహుడు .. ఛత్రవట నరసింహుడు .. పావన నరసింహుడుగా కొలువై పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఈ క్షేత్రంలో ఆవిర్భవించిన ఒక్కో నారసింహ రూపానికి ఒక్కో ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రతి రూపం మహిమాన్వితమైనదిగా అనిపిస్తుంది.
'ఛత్రవట నరసింహ స్వామి' విషయానికే వస్తే, పూర్వం ఇక్కడి స్వామివారికి గొడుగు పట్టినట్టుగా ఒక మర్రిచెట్టు ఉండేదట. అందువలన ఈ స్వామివారికి 'ఛత్రవట నారసింహుడు' అనే పేరు వచ్చిందని అంటారు. సాధారణంగా నరసింహస్వామి ఉగ్రమూర్తిగా దర్శనమిస్తుంటాడు. ఇక్కడ ఛత్రవట నరసింహుడు మాత్రం వక్షస్థలంలో లక్ష్మీదేవిని కలిగి వుండి, ప్రశాంతంగా నవ్వుతూ దర్శనమివ్వడం విశేషం. ఈ స్వామిని దర్శించుకున్నంత మాత్రాన్నే పాపాలు .. దోషాలు .. శాపాలు తొలగిపోతాయని స్థలపురాణం చెబుతోంది.