ముక్తిని ప్రసాదించే ముక్తీశ్వరుడు!
లోక కల్యాణం కోసం పరమశివుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అనేక లీలా విశేషాలను ప్రదర్శిస్తూ పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఆ స్వామి కొలువైన పరమ పవిత్రమైన క్షేత్రాలలో 'ముక్తేశ్వరం' ఒకటి. ఎంతో ప్రాచీనమైన క్షేత్రంగా విలసిల్లుతోన్న 'అయినవిల్లి'కి సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ స్వామి 'ముక్తేశ్వరుడు' పేరుతో పూజలు అందుకుంటూ ఉంటాడు.
ఈ క్షేత్రంలోని 'ముక్తేశ్వరుడు' శ్రీరాముడి కాలానికంటే ముందు నుంచే కొలువై వున్నాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శ్రీరామచంద్రుడు కూడా ఈ స్వామిని సేవించాడని అంటారు. శ్రీరాముడు ప్రార్ధించిన వెంటనే స్వామి క్షణ కాలంలో ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడట. అందువలన ఇక్కడి స్వామివారిని 'క్షణ ముక్తేశ్వరుడు' అనే పేరుతోనూ భక్తులు పిలుచుకుంటూ వుంటారు. దర్శన మాత్రం చేతనే స్వామి ముక్తిని ప్రసాదిస్తాడు కనుక, సోమవారాల్లోను .. విశేషమైన పర్వదినాల్లోను ఈ క్షేత్ర దర్శనం చేసే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.