ముక్తిని ప్రసాదించే శివలింగ ఆరాధన
ఏ శైవ క్షేత్రానికి వెళ్లినా పరమశివుడు అక్కడ లింగరూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. దేవతలు .. మహర్షులు లింగరూపంలోని శివుడిని అనునిత్యం కొలుస్తుంటారు. ఎంతోమంది మహా భక్తులు ఆ సదాశివుడి నామ స్మరణలోనే తరించారు. మరెంతో మంది ఆ స్వామిని సేవిస్తూ ముక్తిని పొందారు. కల్పం చివరిలో జరిగే ప్రళయ కాలంలో సమస్త జగత్తు సహా దేవతలంతా కూడా శివలింగంలోనే కలిసిపోతారు.
ఆ తరువాత జరిగే కల్పం ఆరంభ సమయంలో .. బ్రహ్మాండం అంతా కూడా శివలింగం నుంచే పుడుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. భూమి పీఠ భాగమైతే .. ఆకాశమే లింగ భాగం. సమస్త దేవతలు ఆ లింగ భాగంలోనే ఉంటారని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. అందువలన ఒక్క శివలింగాన్ని ప్రతిష్ఠించడం వలన, సమస్త దేవతలను ప్రతిష్ఠించిన ఫలితం కలుగుతుందని చెబుతున్నాయి. అలాంటి శివలింగాన్ని నిత్యం పూజించడం వలన ముక్తి కలుగుతుంది.