కామద ఏకాదశి ప్రత్యేకత
చైత్ర శుద్ధ ఏకాదశిని 'కామద ఏకాదశి' అనీ .. 'దమన ఏకాదశి' అని అంటారు. ఈ రోజున ఉపవాస జాగరణ నియమాలున్నాయి. ఆ నియమాలను పాటిస్తూ శ్రీ మహా విష్ణువును పూజించవలసి ఉంటుంది. మరుసటి రోజున ద్వాదశి ఘడియలు ఉండగానే, శ్రీమహా విష్ణువును ఆరాధించి నైవేద్యాలు సమర్పించవలసి ఉంటుంది. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన, సమస్త పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
పూర్వం పుండరీకుడు అనే రాజు కొలువులో, ఓ గంధర్వుడు పనిచేస్తూ ఉండేవాడు. ఒకసారి ఆ గంధర్వుడు తన పట్ల నిర్లక్యంగా వ్యవహరించాడనే కోపంతో, రాక్షసుడిగా మారిపొమ్మని ఆ రాజు శపిస్తాడు. దాంతో ఆ గంధర్వుడు .. రాక్షసుడిగా మారిపోయి సంచరిస్తుంటాడు. అప్పుడు ఆ గంధర్వుడి భార్య 'కామద ఏకాదశి' వ్రతాన్ని ఆచరిస్తుంది. ఆ వ్రత పుణ్య ఫలం చేత ఆ గంధర్వుడు యథా రూపాన్ని పొందుతాడు. అంతటి విశేషాన్నికలిగిన 'కామద ఏకాదశి' వ్రతాన్ని ఆచరించడం మరిచిపోకూడదు.