కామదహనం వెనుక కథ
లోక కల్యాణం కోసం పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరగవలసి ఉండటంతో, దేవతలంతా మన్మథుడిని ఆశ్రయిస్తారు. పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరగవలసిన అవసరాన్ని మన్మథుడికి వివరిస్తారు. తపస్సులో వున్న శివుడు కనులు తెరిచి .. తన సేవలో వున్న పార్వతి వైపు చూసేలా చేయమని కోరతారు.
పరమశివుడి తపస్సుకు భంగం కలిగించడం సామాన్యమైన విషయం కాదు .. అయినా దేవతల కోరిక మేరకు మన్మథుడు అందుకు సిద్ధపడతాడు. పరమశివుడికి తపోభంగాన్ని కలిగించి .. పార్వతి పట్ల ఆయన ఆకర్షితుడయ్యేలా చేస్తాడు. క్షణకాలంలో తన తపస్సుకి భంగం కలిగిందని గ్రహించిన శివుడు తన త్రినేత్రాన్ని తెరవడంతో మన్మథుడు దగ్ధం అవుతాడు. ఆ ఘట్టాన్ని పురస్కరించుకుని .. ప్రతి గ్రామంలోను ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజున, మన్మథుడి గడ్డి బొమ్మను తయారు చేసి దగ్ధం చేస్తుంటారు. శైవ ఆలయాలలో 'కామదహనం' పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు.