అలా శివుడు లింగ రూపాన్ని ధరించాడట!
శైవ క్షేత్రాలలో పరమ శివుడు లింగ రూపంలో దర్శనమిస్తుంటాడు. శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు కనుక, శివలింగాన్ని పూజిస్తే శివుడిని ప్రత్యక్షంగా సేవించిన ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. బ్రహ్మ .. విష్ణువు మధ్య తమలో ఎవరు గొప్ప అనే వాదన తలెత్తినప్పుడు, సదాశివుడు లింగ రూపాన్ని ధరించినట్టు పురాణాలు చెబుతున్నాయి.
ఆయన అలా లింగ రూపాన్ని ధరించడం వెనుక మహర్షుల శాపం కూడా ఉందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. పరమశివుడు ఒకసారి మహర్షుల ఆశ్రమాలకి భిక్షకి వెళతాడు. సుందరమైన ఆయన రూపాన్ని చూసిన యువతులంతా మొహానికి లోనై ఆయన వెంట వెళుతుంటారు. అది గమనించిన మహర్షులు ఆగ్రహావేశాలకి లోనవుతారు. ఆ కోపంతో .. నిరాకారమైన లింగ రూపాన్ని పొందమంటూ శివుడిని శపిస్తారు. ఆ శాపం కారణంగానే పరమశివుడు లింగ రూపాన్ని ధరించాడని చెప్పబడుతోంది.