మహాశివరాత్రి జాగరణ ఫలితం

మహా శివరాత్రి రోజున భక్తులు ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం అంటే జీవాత్మను .. పరమాత్ముని సమీపంలో ఉంచడమే. ఈ రోజున పరమశివుడిని పంచామృతాలతో అభిషేకించాలి. దేవాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించాలి. ఈ రోజున సదాశివుడిని ఒక్కో అభిషేక జలంతో అభిషేకించడం వలన, ఒక్కో విశేషమైన ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ముక్తిని కోరుకునేవారు ఈ రోజున జాగరణ చేయవలసి ఉంటుంది. నిద్రపోకుండా వినోద కార్యక్రమాలను వీక్షిస్తూ మెలకువతో ఉండటం కూడా జాగరణగానే కొంతమంది భావిస్తుంటారు. అయితే ఇలాంటి జాగరణ వలన ఫలితం ఉండదనేది పండితుల మాట. శివనామాన్ని స్మరిస్తూ .. ఆ స్వామిని వివిధ రకాల అభిషేక ద్రవ్యాలతో అభిషేకిస్తూ .. సువాసన గల పూలతో ఆ స్వామిని అర్చిస్తూ .. శివ నామాన్ని కీర్తిస్తూ .. శివుడి లీలా విశేషాలను తలచుకుంటూ జాగరణ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసిన జాగరణ వలన లభించే పుణ్యం జన్మజన్మల పాటు వెంట వస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.             


More Bhakti News