మహిమాన్విత క్షేత్రం అలంపురం
శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనేక ప్రాంతాలలో .. అనేక నామాలతో .. అనేక రూపాలతో ఆవిర్భవించింది. అలా అమ్మవారు 'జోగులాంబా దేవి'గా పూజలు అందుకుంటున్న అలంపురం క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లా పరిథిలో దర్శనమిస్తోంది. తుంగభద్రా నదీ తీరంలోని ఈ క్షేత్రం మహా శక్తిమంతమైనదిగా .. మహిమాన్వితమైనదిగా స్థల పురాణం చెబుతోంది.
18 మహా శక్తులలో ఒకటిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం, ఎంతోమంది రాజుల ఏలుబడిలో వైభవంగా వెలుగొందింది. ఇక్కడి అమ్మవారు జోగులాంబా .. జోగాంబా .. జోగేశ్వరీ పేర్లతో కొలవబడుతుండగా, నవ బ్రహ్మెశ్వర ఆలయాలు ప్రాచీనతకి ప్రతీకగా కనిపిస్తుంటాయి. బాల బ్రహ్మ .. కుమార బ్రహ్మ .. అర్క బ్రహ్మ .. వీర బ్రహ్మ .. విశ్వ బ్రహ్మ .. తారక బ్రహ్మ .. గరుడ బ్రహ్మ .. స్వర్గ బ్రహ్మ .. పద్మ బ్రహ్మ అనే నవ బ్రహ్మెశ్వర ఆలయాలు ఈ క్షేత్ర విశిష్టతకి అద్దం పడుతుంటాయి. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, సమస్త బాధలు .. వ్యాధులు నశించి, సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తుంటారు.