శ్రీరాముడు సృష్టించిన హనుమాన్ ధార
ఏదైనా క్షేత్రానికి వెళ్లినప్పుడు .. ఆ ప్రదేశం సీతారాముల పాద స్పర్శచే పునీతమైనదని తెలిసినప్పుడు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. సీతారాములు అక్కడ కూర్చున్నారు .. ఇక్కడ సేదదీరారు అని తెలుస్తున్నప్పుడు, ఆ దృశ్యాలను కనులముందు సాక్షాత్కరింపజేసుకుంటూ మైమరచిపోతుంటాం. అలా సీతారాములు నడయాడిన ప్రదేశాలలో 'చిత్రకూటం' ఒకటి. వనవాస కాలంలో సీతారాములు ఈ ప్రదేశంలో తిరుగాడారు. ఉత్తరప్రదేశ్ లోని ఈ ప్రాంతమంతా సీతారాములతో ముడిపడి కనిపిస్తుంది.
ఇక్కడ రామ్ కుండ్ .. జానకీ కుండ్ తో పాటు, 'హనుమాన్ ధార' కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓ కొండపై హనుమాన్ ధారను చూడవచ్చు. ఇక్కడ ఈ ధారను సృష్టించింది సాక్షాత్తు శ్రీరాముడేనని చెబుతారు. లంకా దహనం చేసిన హనుమంతుడు, తన శరీరానికి మంటలు అలుముకుంటూ ఉండగా నేరుగా ఈ ప్రదేశానికే వచ్చాడట. అప్పుడు ఆ మంటలను ఆర్పడానికి శ్రీరాముడు ఇక్కడ నీటి ధారను సృష్టించాడని అంటారు. అలాంటి ఈ నీటి ధారను చూసినప్పుడు కలిగే ఆనందానుభూతులకు మాటలుండవు.