శయనించే మూర్తిగా మహాశివుడు
సాధారణంగా ఏ శైవ క్షేత్రానికి వెళ్లినా మహాశివుడు లింగరూపంలోనే దర్శనమిస్తూ ఉంటాడు. చాలా అరుదైన క్షేత్రాల్లో మాత్రమే స్వామి విగ్రహ రూపంలో కనిపిస్తుంటాడు. అలాంటి సదా శివుడు .. శ్రీమహా విష్ణువు మాదిరిగా శయన భంగిమలో కనిపించే క్షేత్రం ఒకటి వుంది .. అదే 'సురటు పల్లి'. ఇది చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో విలసిల్లుతోంది. ఈ క్షేత్రానికి ఈ పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది.
పూర్వం 'అమృతం' కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు హాలాహలం పుట్టింది. లోకాలను రక్షించడం కోసం పరమశివుడు ఆ కాలకూట విషాన్ని మింగేశాడు. ఆ విష ప్రభావం కారణంగా తూలిన ఆయన, కొంతసేపు అమ్మవారి ఒడిలో సేదదీరాడు. ఆ సమయంలో దేవతలంతా అక్కడికి చేరుకున్నారు. సురులంతా దిగివచ్చిన కారణంగా ఈ ప్రాంతానికి 'సురుల పల్లి' అనే పేరు వచ్చింది. కాలక్రమంలో అది కాస్తా 'సురటు పల్లి'గా మారింది. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకి .. శయన భంగిమలో గల శివుడిని దర్శించుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.