భీష్మ ఏకాదశి వ్రత ఫలితం
ఏకాదశి .. శ్రీమహా విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథిగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత వుంది. అలాంటి ఏకాదశులలో 'భీష్మ ఏకాదశి' ఒకటి. మాఘశుద్ధ ఏకాదశిని 'భీష్మ ఏకాదశి అనీ .. జయ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశికి ముందువచ్చే అష్టమి రోజునే భీష్ముడు శరీరాన్ని విడిచిపెట్టాడు. భీష్మాచార్యుడి గుర్తుగానే ఈ ఏకాదశికి ఆయన పేరును ఉంచారు.
ఈ ఏకాదశి రోజున ఉపవాస దీక్షను చేపట్టి శ్రీమహా విష్ణువును పూజించడం వలన .. ఆ రాత్రి జాగరణ చేసి .. మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే ఆ స్వామిని సేవించి వ్రతాన్ని ఆచరించడం వలన సమస్త పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజున 'అంతర్వేది'తో పాటు పలు నరసింహస్వామి క్షేత్రాల్లో కళ్యాణోత్సవం జరపబడుతుండటం విశేషం.