కోపాన్ని విడిచి పెట్టడమే మంచిది!
కొంతమంది ప్రతి చిన్న విషయానికి కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. తమ మాట వినడం లేదంటూ .. తాము చెప్పినట్టుగా నడచుకోవడం లేదంటూ చిందులు వేస్తుంటారు. తమకి నచ్చని పనులు ఎవరు చేసినా కోపంతో విరుచుకు పడుతుంటారు. ఒక్కోసారి అవతలివారి తప్పు లేకపోయినా వీళ్లు తమ ప్రతాపాన్ని చూపుతుంటారు. కోపమనేది ఎవరికి వచ్చినా అది అనర్థాలకే దారి తీస్తుందనేది పెద్దలు అనుభవంతో చెప్పిన మాట.
తమ కోపమే తమ శత్రువు అనే మాటకి తిరుగే లేదు. నిజానికి ఒకరి కోపం ఇంకొకరిని ఏమీ చేయలేదు. ఎవరి కోపం వారినే దహించి వేస్తూ ఉంటుంది. కోపం బంధు మిత్రులను దూరం చేస్తుంది. మానసిక ప్రశాంతతను దెబ్బతీసి సరైన నిర్ణయాలు తీసుకోకుండా చేస్తుంది. కోపంతో చేసే పనుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఇంతటి నష్టాన్ని కలగజేసే కోపాన్ని జయించమని పెద్దలు చెబుతుంటారు. కోపాన్ని విడిచిపెట్టినప్పుడే మనసు ప్రశాంతతకి నిలయమవుతుంది. అలాంటి ప్రశాంతత వల్లనే భగవంతుడిపై మనసు నిలుస్తుంది. ప్రశాంతత కారణంగా భగవంతుడి సన్నిధిలోని అనుభూతి సొంతమవుతుంది. భక్తి మార్గంలో ప్రయాణించాలనుకునే వారి తొలి అడుగు, ప్రశాంతత నుంచే పడుతుందనడంలో సందేహం లేదు.