అదే ఘటికాచలం ప్రత్యేకత
నరసింహస్వామి కొలువైన పరమ పవిత్రమైన ప్రాచీన క్షేత్రాలలో 'ఘటికాచలం' ఒకటి. చెన్నైకి సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది. నరసింహ స్వామి క్షేత్రాలు ఎక్కువగా కొండలపైనే కనిపిస్తుంటాయి. అలాగే ఇక్కడ కూడా స్వామి కొండపైనే కొలువుదీరి వుంటాడు. అమృతవల్లి తాయారుతో కలిసి ఇక్కడి యోగ నారసింహుడు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు.
ఘడియ సేపు స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే చాలు, స్వామి వెన్నంటి వుంటూ రక్షిస్తూ వుంటాడని అంటారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధలు పడుతోన్న వాళ్లు ఈ క్షేత్రానికి ఎక్కువగా వస్తుంటారు. అలాగే మానసిక పరమైన వ్యాధులతోను .. గ్రహపీడల కారణంగా సతమతమవుతోన్న వాళ్లు ఈ క్షేత్రాన్ని ఎక్కువగా దర్శిస్తూ వుంటారు. అలాంటి వాళ్లంతా స్వామి అనుగ్రహంతో ఆయా సమస్యల నుంచి .. బాధల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుందని భక్తులు విశ్వసిస్తుంటారు.