ఆకిరిపల్లి క్షేత్రానికి అందుకే ఆ పేరు
కృష్ణా జిల్లాలోని శివకేశవ క్షేత్రాల్లో 'ఆకిరిపల్లి' ఒకటిగా కనిపిస్తుంది. చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వాతావరణం కలిగిన ఈ క్షేత్రం 'నూజివీడు' సమీపంలో మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. పరమ శివుడు మల్లేశ్వరుడుగా .. శ్రీ మహా విష్ణువు శోభనాచలపతిగా ఇక్కడ పూజలు అందుకుంటూ వుంటారు. ఇక్కడి నరసింహ స్వామి వ్యాఘ్ర నరసింహ స్వామిగా ఆరాధించబడుతూ ఉంటాడు.
రామాలయం .. వేంకటేశ్వరస్వామి ఆలయం .. రాజ్యలక్ష్మీ దేవి ఆలయం కూడా ఇక్కడ అలరారుతుంటాయి. ఇలా ఈ క్షేత్రం అనేక ఆలయాల సమాహారంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి 'వరాహ పుష్కరిణి'ని వరాహ రూపంలో స్వామివారు తవ్వినట్టు స్థల పురాణం చెబుతోంది. అందువల్లనే ఈ పుష్కరిణికి ఈ పేరు వచ్చిందని అంటారు. 'కిరి' అంటే 'వరాహం' అనే అర్థం వుంది. అందువల్లనే ఈ క్షేత్రానికి 'ఆకిరి పల్లి' అనే పేరు వచ్చిందనీ, కాలక్రమంలో అది కాస్తా 'ఆగిరిపల్లి' అయిందని చెబుతారు. శివకేశవులు కొలువైన పరమ పవిత్రమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన, సమస్త పాపాలు నశించి పుణ్య ఫలాలు చేకూరుతాయని చెబుతారు.