సంక్రాంతి రోజున దాన ఫలితం
సూర్యభగవానుడు సమస్త దేవతల తేజస్సును .. శక్తి సామర్థ్యాలను తనలో నిక్షిప్తం చేసుకుని, తనని ఆరాధించే వారిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. అలా ఆయన మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని 'మకర సంక్రాంతి' అంటారు. దీనినే 'మహా సంక్రాంతి'గా కూడా పిలుస్తుంటారు.
సూర్యుడు కొత్తగా ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు 'సంక్రాంతి పురుషుడు'గా పిలువబడతాడు. సంక్రాంతి పురుషుడు వచ్చే వాహనాన్ని బట్టి శుభాలు కలుగుతూ వుంటాయని చెబుతుంటారు. అలాంటి సూర్యభగవానుడిని సంక్రాంతి వేళలో తప్పకుండా ఆరాధించవలసి ఉంటుంది. ధూప దీప నైవేద్యాలతో సూర్యభగవానుడిని పూజించవలసి వుంటుందనీ, సంక్రాంతి వేళలో దానాలు చేయడం వలన విశేషమైన ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున దానాలు చేయడం వలన సిరిసంపదలను .. సుఖ సంతోషాలను పొందుతారని స్పష్టం చేస్తున్నాయి.