కొల్లాపురం మూకాంబికా దేవి
భక్తుల అభ్యర్థన మేరకు భగవంతుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అలా స్వామి కొలువైన క్షేత్రాలు .. ఆ భక్తుల పేరుమీదనే ప్రసిద్ధి చెందాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో 'కొల్లాపురం' ఒకటి. ఈ క్షేత్రానికి ఈ పేరు రావడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం 'కోల మహర్షి' ఇక్కడ తపస్సు చేయగా .. ఆయన తపస్సుకి మెచ్చి పరమశివుడు ఇక్కడ ఆవిర్భవించాడు. ఇక్కడి శివలింగానికి ఒక భాగాన త్రిమూర్తులు .. మరో భాగాన త్రిమాతలు కొలువై ఉంటారని చెప్పాడు.
ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన ముక్కోటి దేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. 'కోల మహర్షి' తపస్సు చేసిన ప్రదేశం కనుక ఈ క్షేత్రానికి 'కొల్లాపురం' అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. కాలక్రమంలో ఆ పేరు 'కొల్లూరు'గా రూపాంతరం చెందింది. ఇక్కడి అమ్మవారు 'మూకాసురుడు' అనే రాక్షసుడిని సంహరించడం వలన, 'మూకాంబిక' అనే పేరుతో పూజలు అందుకుంటూ ఉంటుంది.