నరసింహుడే కొండి కాసులవాడు
హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం, ప్రహ్లాదుడి ప్రార్ధన మేరకు నరసింహస్వామి శాంతించాడు. ఆ తరువాత దేవతల అభ్యర్థన మేరకు స్వామి అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అలాంటి పుణ్య క్షేత్రాల్లో 'పెంచలకోన' ఒకటి. ఈ క్షేత్రం నెల్లూరు సమీపంలో విలసిల్లుతోంది. ఇక్కడి స్వామిని 'కొండి కాసులవాడు'గా పిలుస్తుంటారు. అలా పిలవడం వెనుక ఒక కథ వినిపిస్తూ ఉంటుంది.
పూర్వం ఇక్కడ 'చెంచులు' నివసించేవారట. 'చెంచులక్ష్మి' స్వామివారికి తారసపడింది ఇక్కడేనని చెబుతారు. 'చెంచులక్ష్మి'ని స్వామివారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోగా, అందుకు 'కన్యా శుల్కం' చెల్లించాలని చెంచు పెద్దలు చెప్పారట. అంత మొత్తాన్ని అప్పు చేసిన స్వామి, రానున్న కాలంలో తన క్షేత్రానికి వచ్చే భక్తులు ముడుపులు చెల్లిస్తూ ఉంటారనీ .. వాటితో కొద్ది కొద్దిగా అప్పు చెల్లిస్తూ వస్తానని స్వామి మాట ఇచ్చాడని అంటారు. ఈ కారణంగానే ఇక్కడి స్వామివారు 'కొండి కాసులవాడు' గా పిలవబడుతున్నాడని భక్తులు చెబుతుంటారు.