కోరికలు నెరవేర్చు సదాశివుడు
పరమ శివుడికి బోళా శంకరుడు అనే పేరుంది. భక్తితే సేవిస్తే చాలు .. స్వామి కరుణతో కరిగిపోతాడు. అంకితభావంతో స్వామిని ఆరాధిస్తే చాలు వరాల వర్షం కురిపిస్తాడు. అలాంటి సదా శివుడు చాలా క్షేత్రాల్లో లింగ రూపంలోనే దర్శనమిస్తుంటాడు. విగ్రహ రూపంలో స్వామి దర్శనమిచ్చే క్షేత్రాలు చాలా తక్కువ. అలా స్వామి విగ్రహ రూపంలో కనిపించే క్షేత్రాలలో ఒకటి, అనంతపురం జిల్లా 'అమరాపురం'లో కనిపిస్తుంది.
ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర వుంది. చారిత్రక నేపథ్యం .. ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణం కారణంగా ఈ క్షేత్రం ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఇక్కడి స్వామిని 'సిద్ధేశ్వరుడు' గా భక్తులు పూజిస్తుంటారు. ధర్మబద్ధమైన కోరికను మనసు విప్పి చెప్పుకుంటే చాలు .. స్వామి తప్పక నెరవేరుస్తాడని అంటారు. అందుకనే స్వామికి 'సిద్ధేశ్వరుడు' అనే పేరు వచ్చిందని చెబుతారు. సోమవారాల్లోను .. కార్తీక మాసంలోను .. విశేషమైన పర్వదినాల్లోను స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.