అందుకే అమరావతికి ఆ పేరు

పరమశివుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రాల్లో 'అమరావతి' ఒకటి. సదా శివుడు కొలువైన పంచారామాలలో 'అమరావతి' మొదటిది. తారకాసురుడిని సంహరించడం కోసం ఆయన మెడలోని శక్తిమంతమైన శివలింగాన్ని కుమారస్వామి ఛేదిస్తాడు. దాంతో ఆ శివలింగం ఐదు ముక్కలైపోయి వివిధ ప్రదేశాల్లో పడుతుంది. ఆ ఐదు భాగాలు పడిన ప్రదేశాలే 'పంచారామాలు'గా ప్రసిద్ధి చెందాయి.

వాటిలో మొదటి భాగం పడిన ప్రదేశమే 'అమరావతి'. ఇక్కడి శివలింగం పొడవుగా .. ఎత్తుగా ఉండటం విశేషం. సాక్షాత్తు దేవేంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది. పూర్వం ఈ ప్రదేశంలో దేవతలు (అమరులు) నివసించేవారనీ, అందువల్లనే ఈ క్షేత్రానికి 'అమరావతి' అనే పేరు వచ్చిందని చెబుతారు. దేవతలంతా ఇక్కడి శివుడిని ప్రత్యక్షంగా పూజించడం వలన ఈ పేరు వచ్చిందనే కథనం కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడి అమరేశ్వరుడిని పూజించడం వలన, సమస్త పాపాలు నశించి .. సకల శుభాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.       


More Bhakti News