అందుకే హంపీ క్షేత్రానికి ఆ పేరు
'హంపి' అనగానే అక్కడ కొలువైన విరూపాక్ష స్వామి గుర్తుకువస్తాడు. ఆయన లీలావిశేషాలు కనులముందు కదలాడతాయి. ఎటుచూసినా చారిత్రక నిర్మాణాలు .. శిల్పకళా వైభవం ఆనందాశ్చర్యాలను కలిగిస్తూ ఉంటాయి. విజయనగర రాజుల అభిరుచిని ఆవిష్కరిస్తుంటాయి. అందువలన ఆధ్యాత్మిక పరంగాను .. చారిత్రక పరంగాను హంపి ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది.
కొన్ని వైష్ణవ క్షేత్రాలకి శివుడు క్షేత్రపాలకుడిగా ఉంటే, శైవ క్షేత్రాలకి విష్ణుమూర్తి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తుంటాడు. అలా ఇక్కడి విరూపాక్ష స్వామికి విష్ణుమూర్తి క్షేత్ర పాలకుడిగా కనిపిస్తుంటాడు. పూర్వం ఇక్కడి శివుడిని 'పంపాపతి' గా పిలిచేవారు. పార్వతీదేవి అవతారమైన 'పంపాదేవి'ని శివుడు ఇక్కడే పరిణయమాడినట్టు చెబుతారు. అందువలన పూర్వం ఈ క్షేత్రాన్ని 'పంపా క్షేత్రం'గా పిలిచేవారు. కాలక్రమంలో అది 'హంపీ క్షేత్రంగా' పిలవబడుతోందని అంటారు.