సర్పవరం క్షేత్రానికి ఆ పేరు అలా వచ్చింది
'సర్పవరం' .. శ్రీ భావనారాయణ స్వామి క్షేత్రం. రాజ్యలక్ష్మీ సమేతంగా ఇక్కడ స్వామివారు కొలువై పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. కాకినాడ .. సామర్ల కోటకి మధ్యలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. పంచ భావనారాయణ స్వామి క్షేత్రాలలో ఇది ఒకటిగా చెబుతుంటారు. ఈ క్షేత్రానికి ఈ పేరు రావడం వెనుక పురాణ సంబంధమైన ఒక కథ వినిపిస్తూ ఉంటుంది.
జనమేజయుడు 'సర్ప యాగం' తలపెట్టినప్పుడు, సర్ప జాతులన్నీ ఆహుతి అవుతుంటాయి. అప్పుడు 'అనంతుడు' అనే మహా సర్పం .. సర్పజాతిని రక్షించమని శ్రీమహా విష్ణువును ప్రార్ధిస్తుంది. అనంతుడి ప్రార్ధనను మన్నించిన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై సర్పజాతిని రక్షిస్తాడు. భూలోక వాసులులచే సర్పజాతి పూజలందుకునేలా వరాన్ని అనుగ్రహిస్తాడు. అలా సర్పజాతికి స్వామి వరాన్ని ప్రసాదించిన ప్రదేశం కనుక, ఈ క్షేత్రానికి సర్పవరం అనే పేరు వచ్చిందని చెబుతారు.