సమస్త దోషాలను తొలగించే శివారాధన
పరమశివుడు భక్తుల పాలిట కామధేనువు .. కల్పవృక్షము. ఆ స్వామి నామాన్ని స్మరిస్తే సంతోషంతో పొంగిపోతాడు. అంకితభావంతో ప్రార్ధిస్తే చాలు .. ఉన్నపళంగా వరాలను ప్రసాదిస్తాడు. సోమవారం అంటే స్వామికి ఎంతో ప్రియమైనది కనుక, ఆ రోజున స్వామికి భక్తులు అభిషేకాదులు నిర్వహిస్తుంటారు. ఇక మాస శివరాత్రి అన్నా స్వామికి మహా ఇష్టం. ఈ రోజున స్వామివారిని భక్తితో పూజిస్తే ఆయన మహా ప్రీతి చెందుతాడు.
ఈ రోజు సాయంత్రం స్వామివారికి అభిషేకాలు నిర్వహించి .. బిల్వదళాలతో ఆయనని సేవించాలి. పగలంతా ఉపవాస దీక్షను చేపట్టి, రాత్రంతా శివ నామ స్మరణ చేస్తూ జాగరణ చేయవలసి ఉంటుంది. ఈ రోజున దగ్గరలోని శివాలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని, ఆలయ ప్రాంగణంలో దీపం వెలిగించ వలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన సమస్త దోషాలు తొలగిపోయి, అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.