హనుమత్ వ్రత ఫలితం
తాను ప్రాణప్రదంగా భావించే శ్రీరామచంద్రమూర్తిని పూజించినా, తనని ఆరాధించినా హనుమంతుడు సంతోషంతో పొంగిపోతాడు. అలాంటి భక్తులను ఆదుకోవడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. ఇక హనుమత్ వ్రతాన్ని జరిపించడం వలన, ఆయన మరింతగా ప్రీతి చెందుతాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. 'మార్గశిర శుద్ధ ద్వాదశి' రోజున ఈ హనుమత్ వ్రతాన్ని చేయాలని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.
ముందురోజు రాత్రి ఉపవాసం వుండి, మరుసటి రోజు ఉదయం హనుమంతుడిని షోడశ ఉపచారాలతో పూజించవలసి ఉంటుంది. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారి వ్రతాన్ని పూర్తిచేయవలసి ఉంటుంది. స్వామివారికి ఇష్టమైన అప్పాలను నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ రోజున హనుమత్ వ్రతం చేయడం వలన, ఆయురారోగ్యాలు .. సిరి సంపదలు చేకూరుతాయని స్పష్టం చేయబడుతోంది.