ఆదుకునే అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి లీలా విశేషాలు అనేకం. ఆ స్వామి మహిమలు భక్తుల అనుభవాలుగా ఆవిష్కరించబడుతుంటాయి. అనునిత్యం ఆ స్వామి దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులు తమ గ్రామాల్లో .. కాలనీలలో స్వామి ఆలయాలు నిర్మించుకున్నారు. ఆ ఆలయాలు ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తూ, భక్తిభావ పరిమళాలను వెదజల్లుతున్నాయి.
అలాంటి ఆలయాలలో ఒకటి ఖమ్మంలో కనిపిస్తుంది. ఖమ్మం పట్టణం అనేక ప్రాచీన క్షేత్రాల సమాహారంగా అలరారుతూ ఉంటుంది. చారిత్రక నేపథ్యంతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణం ఉండటం ఈ పట్టణం ప్రత్యేకత. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఇక్కడి అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా కార్తీక .. మార్గశిర మాసాల్లో ఆలయం మరింత సందడిగా కనిపిస్తుంటుంది. అయ్యప్పస్వామి దీక్ష తీసుకున్న ఎంతోమంది భక్తులు, ఇక్కడే 'ఇరుముడి' కట్టుకుని పెద్ద సంఖ్యలో శబరిమల వెళుతుంటారు.