అయ్యప్ప స్వామి దీక్షా ఫలితం
అయ్యప్పస్వామి మూర్తిని చూడగానే పానవట్టంపై కూర్చున్న శివలింగం మాదిరిగా కనిపిస్తాడు. తీరునామం .. పొడవైన పూలమాల ధరించి శ్రీహరి రూపాన్ని గుర్తుకు చేస్తుంటాడు. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు ప్రారంభం కావడం విశేషం. మార్గశిర మాసమంతా అయ్యప్ప భజనలతో ఆలయాలు సందడిగా కనిపిస్తాయి.
హరిహర సుతుడుగా చెప్పబడుతోన్న అయ్యప్పను పూజిస్తే, శివకేశవులను ఆరాధించిన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అయ్యప్ప దీక్ష తీసుకునేవారు తులసిమాలను .. నల్లని వస్త్రాలను ధరించి .. బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది. పాదరక్షలు ధరించకుండానే తమ ప్రయాణాన్ని కొనసాగించవలసి ఉంటుంది.
మండల కాలం పాటు వ్యసనాలకు దూరంగా వుండవలసి ఉంటుంది. ఉదయం .. సాయంత్రం స్నానం .. దీపారాధన చేస్తూ, నేలపై శయనించవలసి ఉంటుంది. చెడు మాటలకు .. చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ, ఆధ్యాత్మిక భావనలతో దీక్షాకాలాన్ని పూర్తిచేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన, ఆ తరువాత కూడా ఇదే విధమైన పవిత్రమైన .. ధర్మబద్ధమైన జీవన విధానం అలవడుతుందని చెప్పబడుతోంది.