సిరిసంపదలను ప్రసాదించే శ్రీనివాసుడు
సాక్షాత్తు శ్రీమహావిష్ణువే కలియుగ దైవమైన శ్రీనివాసుడిగా తిరుమలలో ఆవిర్భవించాడు. లక్ష్మీదేవి స్వామివారి హృదయంలో కొలువై వుంది. అందువలన స్వామివారికి చేసే పూజలు .. అభిషేకాలు అమ్మవారికి కూడా చెందుతాయి. స్వామివారిని దర్శించుకోవడం వలన అమ్మవారిని దర్శించుకున్న ఫలితం కూడా లభిస్తుంది. స్వామి సుకుమారుడు .. సున్నితమైన మనసున్నవాడు. తన భక్తులను కష్టాల నుంచి బయటపడేయడానికి ఆయన ఎప్పుడూ ఆరాటపడుతూనే ఉంటాడు. ఆపదల నుంచి కాపాడే దైవంగా ఆరాధించబడుతూనే వున్నాడు.
లక్ష్మీదేవి చెంతన ఉండటం వల్లనే స్వామివారికి ఆ వైభవం .. ఆ తల్లి సేవలో తరిస్తుండటం వల్లనే ఆయనలో ఆ సంతోషం. స్వామివారు అంటే అమ్మవారికి పంచప్రాణాలు. ఆయనని పూజించేవారంటే ఆమెకి ఎంతో ప్రీతి. అందువలన శ్రీనివాసుడిని పూజించేవారిని ఆ తల్లి ఆత్మీయంగా అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ కారణంగానే శ్రీనివాసుడిని పూజించేవారికి కష్టాలు తొలగిపోవడమే కాదు, సిరిసంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.