వరాల నిచ్చే సదాశివుడు

పరమశివుడు పరమ దయా స్వరూపుడు. ఆయనది అమ్మ మనసు కనుక, ఆర్తితో ఎవరు పిలిచినా పరుగుపరుగునా వస్తాడు. తన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. అందువలన భక్తులు 'శివ శివ' అనుకుంటూ తరిస్తుంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఆ స్వామి దర్శనం కోసం ఆయా క్షేత్రాలను దర్శిస్తుంటారు. ఈ భవసాగరాన్ని దాటించే బాధ్యత నీదే తండ్రీ అంటూ నమస్కరిస్తుంటారు.

ఇక నదీ తీర ప్రాంతంలోని క్షేత్రాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. అలా గోదావరి నదీ తీరంలోని శైవ క్షేత్రాలలో 'ఊడిపూడి' ఒకటిగా కనిపిస్తుంటుంది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఈ గ్రామం వుంది. గోదావరి నదీ తీరంలోని ఈ గ్రామంలో ప్రాచీన కాలానికి చెందిన శివాలయం వుంది. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్వయంగా అభిషేకాలు జరుపుతుంటారు. స్వామి అనుగ్రహం కారణంగా సమస్త దోషాలు తొలగిపోయి .. పుణ్యఫలాలు దక్కుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. కోరిన వరాలనిచ్చే కొండంత దైవంగా ఆయనని సేవిస్తుంటారు.


More Bhakti News