ఒంటిమిట్ట రాముడి మహిమ
కడప జిల్లాలో ప్రసిద్ధమైనటువంటి ప్రాచీన క్షేత్రాలలో 'ఒంటిమిట్ట' శ్రీరామచంద్రమూర్తి క్షేత్రం ఒకటి. సువిశాలమైన ప్రదేశంలో .. భారీ కట్టడాలతో కనిపించే ఈ ఆలయం, ఒకనాటి వైభవాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఎంతోమంది మహారాజులు .. మహా భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్టు చరిత్ర చెబుతోంది. సీతారాములు నడయాడిన ఈ ప్రదేశంలో 'ఇమామ్ బేగ్' అనే పేరుతో ఒక బావి కనిపిస్తుంది.
ఒకప్పుడు కడపకు ప్రతినిధిగా వున్న ఒక ముస్లిం అధికారి, ఇక్కడ రాముడు ప్రత్యక్షంగా వున్నాడా లేదా అనే విషయాన్ని పరీక్షించాలని అనుకున్నారట. అందుకోసం ఆయన ఆలయం వెలుపల నుంచుని రాముడిని మూడు మార్లు పిలిచారట. ఆ పిలుపుకి 'ఓయ్' అంటూ రాముడు పలికాడని అంటారు. దాంతో ఆ అధికారి ఆశ్చర్యపోయి .. రాముడు ప్రత్యక్షంగా ఉన్నాడని తెలుసుకుని, స్వామి వారి కోసం ఇక్కడ బావిని తవ్వించాడని అంటారు. అందువల్లనే అది 'ఇమామ్ బేగ్' బావిగా పిలవబడుతోంది. స్వామివారి మహిమలలో ఇదొకటిగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు.