కార్తీక పౌర్ణమిన శివుడికి నైవేద్యం
కార్తీక మాసంలోని పౌర్ణమికి ఎంతో ప్రత్యేకత వుంది. అందునా ఆ రోజున సోమవారం వస్తే మరింత విశిష్టమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాగే ఈసారి కార్తీక పౌర్ణమి సోమవారం రోజున వచ్చింది కనుక, శివకేశవుల ఆరాధనతో ఆలయాలన్నీ ఎంతో సందడిగా కనిపిస్తున్నాయి. ఈ రోజున పరమశివుడికి ఇష్టమైన పారిజాత పూలతో పూజించవలసి ఉంటుంది. ఒకవేళ పారిజాత పూలు లభించని పక్షంలో, తెల్లని రంగు పూలను సమర్పించవలసి ఉంటుంది.
ఇక ఈ రోజున స్వామివారికి వేటిని నైవేద్యంగా సమర్పిస్తే బాగుంటుందనే సందేహం చాలామందికి కలుగుతుంటుంది. ఈ రోజున పరమశివుడికి వడపప్పు - పానకంతో పాటు, పిండి వంటల్లో గారెలు - బూరెలు నైవేద్యంగా సమర్పించాలి. ఇక అందుబాటులో వున్న ఏ ఫలాలనైనా ఆయనకి ప్రీతితో సమర్పించవచ్చు. ఈ రోజున చేసే శివ నామస్మరణ వలన .. ఉపవాసం వలన .. శివకేశవ దర్శనం వలన అనంతమైన పుణ్య ఫలాలు చేకూరతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.