మహాశివుడి అనుగ్రహమే మాస శివరాత్రి
మాస శివరాత్రి రోజున మహాశివుడిని పూజించడం వలన సమస్త పాపాలు నశించి, పుణ్య ఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇక కార్తీకంలో వచ్చే మాస శివరాత్రి మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, శివారాధన చేయాలి.
సదాశివుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజున ఆయనని 'ప్రదోష కాలం'లో .. అంటే సాయం సమయంలో అభిషేకించి బిల్వదళాలతో పూజించాలి. పగలంతా ఉపవాసం చేసిన వారు .. రాత్రంతా శివనామ స్మరణతో జాగరణ చేయవలసి ఉంటుంది. ఈ రోజున శివాలయానికి వెళ్లి శివదర్శనం చేసుకుని అక్కడ దీపం వెలిగించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున చేసే శివ పూజ వలన జన్మజన్మాలుగా వెంటాడుతోన్న పాపం నశించి, పుణ్యరాశి పెరుగుతుందని అంటున్నాయి.