పుణ్య ఫలాలను అందించే కార్తీకం
జీవితంలో తెలిసో .. తెలియకో చేసే కొన్ని పనులు పాపాలుగా వెంటాడుతూ ఉంటాయి. అలాంటి పాపాలను హరించే మాసంగా కార్తీకమాసం కనిపిస్తుంది. ఈ మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది కనుక, దేవాలయాలు భక్తులతో సందడిగా కనిపిస్తుంటాయి .. దీపాల వెలుగులతో కళకళలాడుతుంటాయి.
ఈ మాసం ప్రతిరోజు పుణ్య ఫలాలను అందించేదిగా చెప్పబడుతోంది. కార్తీక బహుళ అష్టమి శివారాధనకు మరింత విశేషమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున వివిధ రకాల పూలతో పరమశివుడిని పూజించడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. ఇక కార్తీక బహుళ ఏకాదశిని 'రమా ఏకాదశి'గా పిలుస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధించి బెల్లం దానం చేయడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయని అంటారు. కార్తీక బహుళ ద్వాదశి రోజున దూడతో కూడిన ఆవును పూజించడం వలన లభించే పుణ్యం, జన్మజన్మలకి వెంట వస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.