కోరికలు నెరవేర్చు సోమేశ్వరుడు
పరమశివుడి లీలావిశేషాలు తలచుకున్నంత మాత్రాన్నే సమస్త పాపాలు హరించివేయబడతాయి. ఆ స్వామి దర్శనం మాత్రం చేతనే విశేషమైన పుణ్యఫలాలు చేకూరతాయి. భక్తులను అనుగ్రహించడం కోసం ఆ దేవదేవుడు అనేక ప్రదేశాల్లో కొలువుదీరాడు. అలా ఆ స్వామి కొలువైన క్షేత్రాల్లో సోమేశ్వర క్షేత్రం ఒకటిగా కనిపిస్తోంది. నల్గొండ జిల్లా హాలియా సమీపంలో గల 'పేరూరు'లో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.
నల్గొండ జిల్లాలోని ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో ఇది ఒకటిగా అలరారుతోంది. ఈ ఆలయానికి దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర వుంది. ఇక్కడ స్వామి స్వయంభువుగా ఆవిర్భవించాడు. దేవతలు .. మహర్షులు ఇక్కడి స్వామివారిని పూజించారనీ, ఇక్కడి కోనేరులో దేవతలు స్నానం చేసేవారని అంటారు. కార్తీక మాసంలోను .. శివరాత్రికి ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడం వలన, ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.