ముక్తిని పొందిన మహా భక్తులు
భక్తి కూడా భగవంతుడి అనుగ్రహంతోనే కలుగుతుంది. భక్తి మార్గమే ముక్తికి మార్గాన్ని చూపుతుంది. భక్తిని సాధనంగా చేసుకుని ముక్తి మార్గంలో ప్రయాణించిన మహా భక్తులు ఎంతోమంది వున్నారు. వాళ్లు భగవంతుడి నుంచి ఏమీ కోరలేదు .. ఎలాంటివి ఆశించనూ లేదు. భగవంతుడి నామస్మరణలో .. భగవంతుడి దర్శనంతో .. భగవంతుడి సేవలో వాళ్లు అలౌకికమైన ఆనందాన్ని పొందారు. భగవంతుడి రూప .. గుణ విశేషాలను కీర్తిస్తూ, అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు.
కీర్తనలతో .. సంకీర్తనలతో తమ ఇష్ట దైవాన్ని ఆరాధించారు. పోతన .. త్యాగయ్య .. క్షేత్రయ్య .. అన్నమయ్య .. రామదాసు .. పురందరదాసు .. తుకారాం .. నామదేవుడు .. జ్ఞానదేవుడు .. ఏకనాథుడు .. మొల్ల .. మీరాబాయి .. తరిగొండ వెంగమాంబ .. ఇలా ఎంతోమంది భక్తులు భగవంతుడికి రాగాభిషేకం చేశారు. భగవంతుడే ఎన్ని పరీక్షలు పెట్టినా, అచెంచలమైన భక్తితోనే ఆయన మనసును గెలుస్తూ ముక్తిని పొందారు.