లక్ష్మీదేవి నడిచొచ్చే వేళ
జీవితంలో ఏ కార్యాన్ని తలపెట్టాలన్నా .. ఆపదలు .. అవసరాల నుంచి గట్టెక్కాలన్నా అందుకు ధనం అవసరమవుతుంది. అలాంటి సంపదలను ప్రసాదించేది లక్ష్మీదేవి. ఆ తల్లి అనుగ్రహం వల్లనే సంపదలు సమకూరుతాయి. అందుకే అంతా లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాల కోసం పూజిస్తుంటారు. అలా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి 'దీపావళి' పర్వదినానికి మించిన రోజు లేదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
'దీపావళి' అంటే దీపాల వరుస. ఈ రోజున సాయంత్రం వేళ లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, వాకిళ్ల ముందుగా వెళుతుంటుందని చెబుతుంటారు. లక్ష్మీదేవి పరిశుభ్రతను .. పవిత్రతను ఇష్టపడుతుంటుంది. అందువలన ఎవరి ఇల్లు మంగళ తోరణాలతో శుభకరంగా కనిపిస్తూ ఉంటుందో .. ఎవరి ఇంటిముందు దీపాలు వెలిగించబడి వుంటాయో .. ఎవరి ఇంట ఆమె ఆరాధన జరిగి ఉంటుందో ఆ ఇంట్లో ఆమె తన 'కళ'ను ఉంచి వెళుతుందని అంటారు. అందువలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుకునేవారు, ఈ రోజున ఆ తల్లిని పవిత్రతతో .. పరమభక్తితో సేవించడం మరిచిపోకూడదు.