ఆలయంలో గంటను మ్రోగించాలి
దేవాలయం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది .. ఆధ్యాత్మిక భావాలను వికసింపజేస్తుంది. కష్టనష్టాలలో భగవంతుడు అండగా ఉన్నాడనే భరోసా కలుగుతుంది. దేవాలయంలో జరిగే భజనలు అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తాయి .. భక్తి మార్గంలో మరింత వేగంగా నడవడానికి ఉపయోగపడతాయి.
దేవాలయానికి వెళ్లగానే గంటను మ్రోగిస్తుంటాము. దర్శనం కోసం తాము వచ్చిన విషయం భగవంతుడికి తెలియజేయడానికి అలా గంటను మ్రోగిస్తుంటాము. అంతేకాదు భగవంతుడిని పూజించే సమయంలో ఎలాంటి అసుర శక్తులు ఆటంకం కలిగించకుండా గంటను మ్రోగించడం జరుగుతూ ఉంటుంది.
అందువలన గంటను మ్రోగించే సమయంలో "ఆగమార్థం తు దేవానాం గమనార్థం తురక్షసామ్ .. తస్మాత్ సర్వ ప్రయత్నేన సమ్యక్ ఘంటామ్ నినాదాయే" అనే శ్లోకాన్ని చెప్పుకోవాలని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాన దైవాన్ని దర్శించుకున్న అనంతరం, ఉపాలయాలు కూడా దర్శించుకోవాలి. కాసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చుని .. భగవంతుడు తనకి చేసిన మేలును తలచుకుని .. మనసులోనే ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇకపై కూడా తనని కనిపెట్టుకుని ఉండమని వేడుతూ .. పునర్దర్శన భాగ్యం లభించేలా చేయమని కోరుతూ సెలవు తీసుకోవాలి.