అందుకే హుంకారిణి దేవికి ఆ పేరు
పిఠాపురం అనేక విశేషాల .. ఆలయాల సమాహారంగా కనిపిస్తుంది. పురుహూతికా దేవి శక్తిపీఠం గాను .. కుక్కుటేశ్వర క్షేత్రంగాను .. శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానంగాను ఈ క్షేత్రం విలసిల్లుతోంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో అడుగుపెట్టడమే అదృష్టంగా భక్తులు భావిస్తుంటారు. పరమశివుడిని ఇక్కడ 'కుక్కుటేశ్వరస్వామి'గా పూజిస్తుంటారు. గయాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం కోసం శివుడు ఇక్కడ 'కోడి' రూపాన్ని ధరించడం వలన ఈ పేరుతో కొలవబడుతున్నాడు.
ఈ స్వామివారి సన్నిధిలో అమ్మవారు 'హుంకారిణి దేవి' పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. పూర్వం 'ధూమ్రలోచనుడు' అనే రాక్షసుడిని అమ్మవారు 'హుంకారం' చేత సంహరించింది. అందువలన అమ్మవారు ఇక్కడ ఈ పేరుతో పూజలందుకుంటోంది. ఈ అమ్మవారిని సేవించడం వలన సంతాన సౌభాగ్యాలు కలుగుతాయనీ, ఆపదలు .. అనారోగ్యాలు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.