శివ నామ స్మరణ ఫలితం
పరమశివుడు భక్త వశంకరుడుగా పిలవబడుతున్నాడు. శివ .. శివా అనే నామాన్ని స్మరించినంత మాత్రాన్నే కరుణించే కొండంత దైవంగా కొలవబడుతున్నాడు. అలాంటి సదాశివుడికి అభిషేకం వలన కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఇక తన నామాన్ని సదా స్మరించే భక్తులంటే ఆయనకి ఎంతో ప్రీతి. శివనామ మహిమ అపారమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
'శి' అంటే పాపాలను నశింపజేసేది .. మంగళప్రదమైనది అనే అర్థం వుంది. ఇక 'వ' అంటే ముక్తినిచ్చేవాడు .. అనుగ్రహించేవాడు అనే అర్థం వుంది. అలాంటి శివుడి నామాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ ఉండాలి. ఈ జన్మలోనే కాకుండా .. క్రితం జన్మలలోను చేసిన పాపాలు వెంటాడుతూ ఉంటాయి. అలాగే అనేక దోషాలు జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఇక కర్మ ఫలితం కారణంగా జీవితం దుఃఖమయం అవుతూ ఉంటుంది. ఇలాంటి వాటి నుంచి బయటపడేసే శక్తి శివ నామానికి వుంది. శివ నామం జపించడం వలన సుఖసంపదలు చేకూరతాయి .. ఆ తరువాత పరమపదం లభిస్తుంది.