ఈ రోజున ఉమాదేవిని పూజించాలి
శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో మరింతగా ఆ తల్లిని సేవిస్తుంటారు. తమకి సకల సౌభాగ్యాలను ప్రసాదించి .. తమ జీవితాన్ని ఆనందమయం చేసేది అమ్మవారేనని వాళ్లు భావిస్తుంటారు. అందువలన అమ్మవారిని పూజించే ఏ అవకాశాన్ని వాళ్లు వదులుకోరు. అలా అమ్మవారు పూజలందుకునే విశేషమైన రోజుల్లో ఒకటిగా 'అట్ల తద్దె' కనిపిస్తుంది.
ఆశ్వయుజ బహుళ తదియన జరిపే అట్లతద్దె రోజున 'ఉమాదేవి'ని పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున చంద్రోదయం అయ్యేంతవరకూ ఉపవాసం చేసి, ఆ తరువాత ఉమాదేవిని పూజించాలి. ఆ తల్లికి ఇష్టమైన 'అట్ల'ను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత ముత్తయిదువులకు వాయనం ఇవ్వవలసి ఉంటుంది. ఈ నోమును నోచుకోవడం వలన వివాహం కానివారికి గుణవంతుడైన భర్త లభిస్తాడు. వివాహమైనవారికి నిండు ఐదవతనం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.